వరంగల్ వాసుల్లో ‘బత్తిని మొగిలయ్య గౌడ్’ గురించి తెలియని వాళ్లు ఉండరు. రజాకార్లతో పోరాడి అమరుడైన వీరుడు మొగిలయ్య. ఆయన భార్యే లచ్చవ్వ. డబ్బుకు ఆరాటపడని ఆ తెలంగాణ తల్లి తన భర్త వేన వేల జ్ఞాపకాలను మదిలో దాచుకున్న తీరు చదవండి...‘‘..చిన్నప్పుడే నాకు మొగిలయ్యతో పెండ్లైంది. ఆయన చానా పొడుగరి. అందరితో
మంచిగా సోపతి జేసేటోడు. రోజు బండరాళ్లను పైకి కిందికి ఎత్తుతూ, కత్తులను, కర్రలను ఇటు అటు తిప్పుతూ సాధన జేసేటోడు. ఆయన గుర్తుగా ఇప్పటికి అవి నేనున్న మా కోట ఇంట్లనే ఉన్నయి. ఆ రోజు ఆదివారం (11--1946). నేను పదిహేనొద్దుల బాలింతను. గారోజు పొద్దుగాల్నే మొగిలయ్య వరిమండెకు నీళ్లు బోసి వత్తనని పోయిండు. అప్పుడే వాళ్ళమీద మన్నుబడ రజాకార్లు వచ్చిండ్లు. మా ఇంటి ముంగట లొల్లిబెట్టుకుంట రాళ్లతో గొట్టుకుంట ఆగమాగం జెయ్యబట్టిండ్లు. ఎట్ల దెలిసిందో ఏందోగని ఆయన పొలం కాడికని పోయినోడు ఉరికచ్చి మా ఇంట్ల, గడ్డి గుడిసె సూరులో దాసిన జంబియా దీసి బయటకురికి రజాకార్ల మీద పడ్డడు. ఇంట్ల ఉన్న నాకు, మా అత్తకు ఏం జరుగుతాందో తెల్వలే. అటెంక కొద్దిసేపట్లనే ఒర్రుడు, తుపాకి దెబ్బలు ఇన్పడ్డయి. వాళ్ళమీద మన్నుబడ ఆయనను సంపనే సంపిండ్లు.
తమ్మున్ని సంపుతాంటే అడ్డంబోయిన మా బావకు సుత కత్తి దెబ్బల్ దాకినయ్, అటెంక అందరు నా మంచం సుట్టూత జేరిండ్రు. గుండెలు అవిశిపోయేటట్టుగ ఏడ్చిన. అటెంక ఎవలు మందలిచ్చెటోల్లే లేకుంట అయింది. మొగిలయ్యతో కలిసి తిరిగినోళ్లు, లీడర్లు, దేశ దేశాలల్ల మొగిలయ్య పేరు మీద పైసలు వసూలు జేసిండ్లు, వసూలు చేసిన పైసలు అందరి ముంగట ఇచ్చెటోల్లు..తెల్లారే మల్ల తీసుకపోయేటొల్లు. ఒక్కపైస నా చేతికి రాలే.’’
-లచ్చవ్వ ఇప్పుడు కూడా అప్పుడు మొగిలయ్యతో కలిసి కాపురం చేసిన ఇంట్లోనే ఉంటున్నది. తనను ఎవ్వరు గుర్తించకున్నా, గౌరవించకున్నా మొగిలయ్యతో పంచుకున్న జ్ఞాపకాలు ఇంకా తన మనసులో సజీవంగా ఉన్నట్టు చెప్పింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య లచ్చవ్వను సన్మానించి వెయ్యినూట పదహార్ల రూపాయలివ్వబోతే. ‘వెయ్యి నూట పదహార్లు, వద్దు వేల జ్ఞాపకాలు సాలు’ అని, ఆ సన్మానాన్ని, డబ్బుని తిరస్కరించింది.
అదీ ఆమె ఆత్మగౌరవం. అట్ల డబ్బుకు ఆరాటపడని ఆ తెలంగాణ తల్లికి వందనాలు.
(‘చరిత్ర మరవని ఓరుగల్లు ఉద్యమ కెరటం-బత్తిని మొగిలయ్య గౌడ్’
No comments:
Post a Comment