Pages

Monday, November 11, 2013

కొత్తపల్లి జయశంకర్‌





కొత్తపల్లి జయశంకర్‌


తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 - జూన్ 21, 2011) వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011, జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.
బెనారస్‌, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ ఓయూలో పీహెచ్‌డీ చేశాడు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ సీకేఎం ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు కేయూ రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశాడు.
అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమ్జన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి వరవరరావు లాంటి వాళ్లు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమ్జన్సీ గడ్డురోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్ సార్‌కే సాధ్యం అంటూ ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రముఖ సాహీతివేత్త రామశాస్త్రి కన్నీళ్లపర్యంతమయ్యారు. జయశంకర్ విద్యార్థుల్లో అనేక మంది దేశవిదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో కేయూ మాజీ ప్రొఫెసర్ ఎన్. లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ కే. సీతారామావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్.
1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1952 లో జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చాడు. కె.సి.ఆర్ కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించాడు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు. అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్‌నా ఔర్ మర్‌జానా' (ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి) అని అనేవాడు.
విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుంచే తెలం‘గానం’ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనా టి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశా లాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సా ర్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన అపర మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణకోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయ నం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసిన అక్షరయావూతికుడు ఆయన.
తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద , విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణన్నినాదాన్ని వినింపించిన పోరాట శీలి.
తెలంగాణ సాధికారిక స్వరం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఇంటర్వ్యూ ప్రారంభసంచికలో వేయాలని ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ అల్లం నారాయణ సార్ ఆ బాధ్యతను నాపై పెట్టారు. జయశంకర్ సార్‌తో మాట్లాడటమంటే.. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమాన్ని గురించి తెలుసుకోవడమే. ఆ ఉత్సాహంతోనే సార్‌కు ఫోన్ల మీద ఫోన్లు చేసి విసిగించాను. ‘ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు. అయినా ఇప్పుడు నా ఇంటర్‌వ్య్యూ ఎందుకయ్యా చూద్దాం లే..’ అంటూ సున్నితంగా తిరస్కరించినప్పటికీ… చివరికి ఒప్పుకున్నారు.
హబ్సీగూడ రోడ్ నెంబర్ 5లో ఉన్న ‘కాంక్రీట్ హార్మొని’ అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్థులోని పెంట్‌హౌస్… అక్కడి నుంచి చూస్తే ఉద్యమాల పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ గొప్పగా కనిపిస్తోంది. అదేమాట సార్‌తో అంటే… ‘ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది చెప్పు.. అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తయి.. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తు కనిపిస్తరు. దు:ఖమొస్తది.. అయితే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు… అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్నాపకం. కానీ వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని… వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయనాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
మీరు చేయాల్సింది మీరు చేశారు. ఈ సమయంలో నేను ఇక్కడ ఇక ఉండలేను. నేను వరంగల్‌కే పోతాను. నన్ను పంపండి’ అంటూ ఆయన పుట్టిన గడ్డమీద మమకారంతో వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. ఇంట్లోనే వైద్యులు ఆయనకు అన్నిరకాల వైద్యసేవలు అందించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆయన పల్స్‌రేట్ పడిపోవడంతో ఆక్సిజన్ అందించారు.
మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం.. ఇదే జీవితం.. ఇందులోనే మరణం! ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు ప్రొఫెసర్ కొత్త పల్లి జయశంకర్ రెండేళ్లుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రొఫెసర్.. 21.6.2011 మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
మృత్యువు క్యాన్సర్ రూపంలో అతడ్ని దహించింది. కానీ సమైక్యాంధ్రలో బతుకు అతడ్ని అనుక్షణం రాచపుండై వేధించింది. జయశంకర్ ఓ సామాన్యమైన వ్యక్తి. సగటు తెలంగాణ బిడ్డ. కానీ మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగినాడంటే, మలి తెలంగాణ ఉద్యమానికి ముగ్గు పోసిన దీర్ఘదర్శి అయినాడంటే అది ఉట్టిగ జరగలేదు. అది ఎంతటి సంఘర్షణతో కూడుకున్నదో తన సన్నిహితులకు తెలుసు. ఇవ్వాళ నలుగురికీ తెలువాల్సిందీ ఒకటుంది. అది క్యాన్సర్ అని!
అవును. ఆయన క్యాన్సర్‌తో పోయిండు. తెలంగాణంలో మనం రాచపుండు అంటమే అది ఆయన్ని పట్టి పీడించింది, ఇవ్వాళా నిన్నకాదు. ఆ సంగతి చెప్పడానికి ముందు ఒక ఘట్టాన్ని చెప్పుకోవాల్సిందే. అది నిజాం స్టేట్. తనకు టీచర్‌గా అపాయింట్‌మెంట్ ఆర్డర్ చేతికందిన సందర్భం. అందరి లెక్కనే సంతోషంతో నలుగురికీ చెప్పుకున్నడు. మురిసిపోయిండు. తీరా ఉద్యోగంలో చేరేందుకు వెళ్లేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. సరేలే అనుకుని అట్లనే అపాయింట్‌మెంట్ ఆర్డర్ చేత పట్టుకుని జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళితే, తన స్కేల్ మారిందని తెలిసి విస్తుపోయిండు. నిజమే మరి. ఆంధ్రప్రదేశ్ అవతరణతో మన జీతాల్ని తగ్గించిండ్రు. ‘ఏంటిది?’ అని అడిగితే, ‘మిస్టర్ జయశంకర్. ఇది మీ నిజాం గవర్నమెంట్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మైండిట్..’ అన్నరట. దాంతో జయశంకర్ మరింత ఖంగుతిన్నడు.
ఇంకేమన్నరంటే, ‘ఇష్టముంటే చేయి లేకపోతే లేదని’ అమర్యాదగా చెప్పిండట. దాంతో ఆయన అహందెబ్బతింది. ఆత్మగౌరవం భంగపడ్డది. నిజానికి ఇంకా తాను అన్యాయం అని కూడా అనలే. కానీ వాళ్ల తీరు అట్ల ఉండింది. ఒక పురుగును చూసినట్టు చూసి, అతడ్ని హేళన చేసిండ్రు. అప్పుడు తన కళ్లు విచ్చుకున్నయి. ఇదేంది. మనని బతిమాలి బామాలి ఉమ్మడిగా ఉందాందామని ఒప్పించిన వాళ్లేనా వీళ్లు. మన గడ్డమీద మననే పరాయివాళ్లుగా ట్రీట్ చేయడం ఏమిటీ అని జయశంకర్ విస్తుపోయిండు. వాళ్ల జీతాలతో సమానంగా మన జీతాలు తగ్గించినందుకు సంజాయిషీ ఇవ్వవలసింది పోయి తలబిరుసుతో ’ ఉద్యోగం చేస్తే చేయి… లేకపోతే లేదు’ అని అనడం యువకుడైన జయశంకర్‌ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టయింది. తెలంగాణ బిడ్డగా మొట్టమొదటి సారిగా జయశంకర్ సార్ తీవ్రంగా హర్ట్ అయ్యింది ఇక్కడే. ఇక, అదీ మొదలు, ఆయన ఎన్నో చూసిండు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ వల్ల తెలంగాణ బిడ్డలు ఇంకెన్ని విధాలు మోసపోతరో ఆ రోజే తనకు అర్థమైంది. ప్రశ్నిస్తే మననెట్లా హేళన చేస్తరో, దెబ్బలు తీస్తరో ఆరోజే ఆయనకు తేటతెల్లమయింది. ఒక్కమాటలో ‘ఆంధ్రపదేశ్ అవతరణ’ తెలంగాణ పాలిట రాచపుండు అన్న సంగతి ఆయనకు ఆనాడే సుస్పష్టమైంది. ఇవ్వాళ ఆయన క్యాన్సర్‌తో మరణించిండంటే అది చిన్న విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయాలు, అణచివేతలు, లాఠీలు, తూటాలు, చివరకు నిన్నమొన్నటి పిల్లలు తన ముందే పిట్టల్లా రాలిపడుతుంటే, ఇంతటి సంక్షోభాన్ని చూస్తూ చూస్తూ ఆయన ఇంతకాలం బతికిండంటే అది ఓ నరకయాతన.
నిన్నమొన్న వచ్చిన క్యాన్సర్ తన శరీరాన్ని దహించివుండవచ్చుగాక, కానీ నాటినుంచే తన మనసును సలసల మరిగించిన కోస్తాంధ్రుల అనైతిక పరిపాలన అతడ్ని తీవ్రంగా కృంగదీసింది. ఆ పరితాపం, నిస్సహాయతనుంచే ఆయన ఒక అనివార్యమైన కలగన్నాడు. అదే ‘ప్రత్యేక తెలంగాణ’ . ఇందుకోసమే ఆయన ‘సిద్ధాంతకర్త’గా’ తన మేధస్సుకు పదును పెట్టుకోవాల్సి వచ్చింది. సమకాలీన రాజకీయాలను ఔపోసాన పట్టేలా, ‘భౌగోళిక తెలంగాణ’కు మద్దతుగా నిలబడేలా చేసింది. తెలంగాణ ఏర్పాటు వైపు అన్ని రాజకీయపార్టీలూ ఐక్యంగా కదిలేందుకు అహర్నిశలూ శ్రమించేలాచేసింది. స్వయంగా ఉద్యమకారుడూ కావాల్సి వచ్చింది. కాళోజి ‘నా గొడవ’ ను ‘తెలంగాణ గొడవ’ గా మలిచేలా చేసింది. ‘తెలంగాణ రాష్ర్టం- ఒక డిమాండ్’ అన్న పుస్తకమే తన బతుకు పుస్తకంగా మారేలా చేసింది. నిజానికి సార్ చాలా మామూలుగా మనిషి. ఎటువంటి వ్యధాభరిత ప్రయాణం లేకుండా హాయిగా, నిమ్మలంగా బతకాల్సిన ఓ మామూలు మనిషి. కానీ, ఇయ్యాళ తనకోసం యావత్ తెలంగాణ కన్నీరుకార్చే మనిషయ్యిండంటే -అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ లేదా 1 నవంబర్ 1956. అదే తెలంగాణను పట్టిపీడిస్తున్న రాచపుండు. లాస్టుల ఒకటే మాట. ఆయన మనను వీడిపోయినందుకు మనం బాధపడితే తన ఆత్మ శాంతించదు ఈ పీడ వదిలితేనే ఆయనకు మనశ్శాంతి.

No comments:

Post a Comment