Pages

Tuesday, February 18, 2014

భద్రాచలం


                       భద్రాచలం
భద్రాచలం లేదా శ్రీరామ దివ్యక్షేత్రం ఆంధ్ర ప్రదేశ్, ఖమ్మం జిల్లాలో, గోదావరి నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం. భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రము. జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., మణుగూరు 35 కి.మీ., కొత్తగూడెం 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి.
భద్రాచలం రెవెన్యూడివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. అంధ్ర,హైదరాబాదు రాష్ట్రాలు విలీనమయి కొత్తగా ఖమ్మం జిల్లాను ఏర్పరిచేసమయములో దీనిని ప్రస్తుత ఖమ్మం జిల్లాలో విలీనము చేయటము జరిగింది. తెలంగాణఉద్యమము తీవ్రముగా ఉన్న ఈరోజులలో ఇది వివాదాస్పదము అయ్యే సూచనలు ఉన్నాయి.

భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో మద్రాసు గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. 8.4.2002న G.O.Ms.No.118 (PR & RD), ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడినది.[1] భద్రాచలం టౌన్షిప్ గా తరువాత మునిసిపలిటిగా ఎదిగినప్పటికీ ఎక్కడ ఉన్న 1/70 ఆక్ట్ అనుసరించి మరల దీనిని గ్రామపంచాయితీ గా మార్చుట జరిగింది.
2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి భూక్యా శ్వేత ఎన్నికైనారు.
రామాలయ ప్రశస్తి

ప్రధాన వ్యాసం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం
పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడుకి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు స్థిర పడింది. దీనినే రామాలయం అని కుడా అంటారు.


గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను(6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.
ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్ధించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది.


భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు


భద్రాచల దేవస్థానము వద్ద రామదాసు విగ్రహం


గోదావరిలో పడవల రాకపోకలు


భద్రాచలం నరసింహ స్వామి దేవాలయంలో శ్రీరామలక్ష్మణుల చిత్రపటం.
దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.
భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచినాడు.

రవాణా సౌకర్యాలు

మండలకేంద్రమైన భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి రెండు, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.
గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి. భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది.
వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి లిఫ్ట్‌ సౌకర్యం కలదు దక్షిణం వైపు మెట్ల నుంచి ఈ లిఫ్ట్‌ ఆలయ గాలిగోపురం ముందుకు చేరుస్తుంది By Jithin..
కొన్ని వివరాలు

భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం 2002లో శ్రీరామ దివ్యక్షేత్రం పట్టణంగా మార్చింది. భద్రాచలం రెవిన్యూ మండల జనాభాలో దాదాపు మూడోవంతు గిరిజనులు. వ్యవసాయాధారిత ఆర్ధికవ్యవస్థ. పర్యాటకం మరో ప్రధాన ఆర్ధిక వనరు. ప్రతీ వర్షాకాలంలోను గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం పట్టణపు పల్లపు ప్రాంతాలు జలమయం కావడం సర్వసాధారణంగా ఉండేది. పట్టణ అభివృద్ధిలో భాగంగా నదికి వరదకట్టను నిర్మించిన తరువాత ఈ బెడద బాగా తగ్గింది. ప్రభుత్వ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం (ఐ.టి.డి.ఏ) భద్రాచలంలోనే ఉంది.
లోక్‌సభ నియోజకవర్గం: మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం (పునర్విభజన అనంతరం)
శాసనసభ నియోజకవర్గం: భద్రాచలం శాసనసభ నియోజకవర్గం
రెవిన్యూ డివిజను: భద్రాచలం
చూడదగ్గ ప్రదేశాలు
భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం
దగ్గరలో ఉన్న పర్యాటక స్థలాలు

కిన్నెరసాని: భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము, జింకల పార్కు ఉన్నవి
పర్ణశాల: వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడి నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం.
పాపి కొండలు: సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది.



అయినవోలు

అయినవోలు
అయినవోలు వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలోని గ్రామము. అయినవోలు వరంగల్లు నుండి 12 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ కాకతీయులు కట్టించిన మల్లికార్జునస్వామి ఆలయం అయినవోలు మల్లన్నగా ప్రసిద్ధి చెందినది.
క్రీ.శ.1118లో త్రిభువనమల్ల బిరుదాంకితుడైన, పశ్చిమ చాళుక్య రాజు, ఆరవ విక్రమాదిత్యుడు, దండనాయకుడైన సూరయ్య (అయ్యన్నమరస)కు అయ్యనవోలు సూరేశ్వర దేవుని నిత్యారాధనకు, బిక్షుకుల నిత్యాన్నదాన నిమిత్తం భూదానం చేసినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఈ అయ్యనచే నిర్మింపబడి అయ్యన్నప్రోలుగా పిలువబడి, ప్రస్తుతం ఐనవోలుగా రూపాంతరం చెందింది.
మైలారదేవుని ఆలయాన్ని కాకతీయ రాజు రెండ ప్రోలుని కుమారుడు రుద్రదేవుడు నిర్మించాడని సిద్ధేశ్వర చరిత్ర వల్ల తెలుస్తున్నది.[1] ఆలయానికి తూర్పు మరియు దక్షిణ దిశలలో రెండు కీర్తితోరణాలను కాకతీయ రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణానికి పూర్వమే ఇక్కడ నిర్మింపజేశాడు. అందుకు తార్కాణంగా ఇదే శైలిలో నిర్మింపబడిన కాకతీయ కీర్తితోరణాలను ఈ నాటికీ మనం ఓరుగల్లు కోటకు నాలుగు దిక్కులా చూడవచ్చును. అయితే ఓరుగల్లులోని కీర్తితోరణాల శిల్పనిర్మాణ శైలి, సౌందర్యం చాలా పరిణతి చెంది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంతటి శిల్పసౌందర్యం ఐనవోలు తోరణాలలో మనకు కనిపించదు. అయితే, ఐనవోలు దేవాలయానికి శిలాతోరణాలను నిర్మించడం వెనుక ఒక కథను ఉటంకిస్తారు. అదేమంటే, కాకతీయ ప్రోలరాజు ఒకరోజున వేయిస్థంభాల దేవాలయంలో, నిద్రలో ఉన్న తనకుమారుడు రుద్రదేవుణ్ణి పుత్రవాత్సల్యంతో స్పృశించగా, మగతనిద్రలో ఉన్న రుద్రదేవుడు, తనను ఎవరో శత్రువులు చంపడానికి వచ్చినారని భావించి, తన మొలలోఉన్న కైజారును తీసి రుద్రదేవుణ్ణి పొడుస్తాడు. తండ్రి చావుకు కారకుడనైనానన్న పాపభీతితో ఐనవోలు ఆలయానికి శిలాతోరణాలను నిర్మింపజేశాడు. ఈ అంశం,1935వ సం.లో మారేమండ రామారావు సంపాదకత్వంలో వెలువడిన కాకతీయ సంచికలో పేర్కొనబడినది
12వ శతాబ్దంలో మైలార లేదా మల్లారి దేవుని ఆలయంగా నిర్మింపబడిన ఈ ఆలయం, ఆ తరువాత కాలంలో మల్లన్న, మల్లిఖార్జున ఆలయంగా రూపాంతరం చెందింది. క్రీ.శ.1369 లో ఐనవోలు ఆలయ ప్రాంగణంలోని ఒక స్తంభంపై రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన సింగమనాయకుని కుమారుడు, అనపోత చెక్కించిన సంస్కృతాంధ్ర దాన శాసనంలో మల్లరి వృత్తాంతము వర్ణించబడిండి. అర్జునున్ని కాపాడటానికి శివుడు ఒక శబరుని వేషం ధరించి, మల్ల అనే రాక్షసున్ని సంహరించాడు. అలా మల్ల+అరి=మల్లరి అన్న పేరు తెచ్చుకున్నాడు. మల్లరి అనే పేరు కాలక్రమంలో మైలార అయ్యింది.[2]
స్వామివారి రూపం భీకరంగా పది అడుగుల ఎత్తుతో, విశాల నేత్రాలతో, కోరమీసాలతో ఉంటుంది. చతుర్భుజాలు కలిగి నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, పానపాత్ర ఉంటాయి. ఇరువైపులా దేవేరులు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. కుడి పాదం క్రింద మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణి-మల్లాసురుల శిరస్సులుంటాయి. ఈస్వామివారిని మల్లన్న, మల్లికార్జునస్వామి, ఖండేల్ రాయుడు అని పిలుస్తారు. ఆలయంలో ఉన్న శివలింగం అర్థప్రాణవట్టంపై ఉన్నది. ఇది అరుణ వర్ణంలో ఉంటుంది. కుజ గ్రహానికి అధిష్టాన దైవతం. శివలింగంపై పార్థప్రహారం స్పష్టంగా కనిపిస్తుంది.
స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతాయి. ఇవి పాంచాహ్నిక దీక్షతో, అయిదు రోజులపాటు వరుసగా అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణవాహనాలను అధిరోహించి చివరిరోజున రథారూఢుడై పురవీధి సేవకు బయలుదేరుతాడు. అయిదవరోజున ప్రాతః కాలంలో అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి, శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు. ప్రతీ మాసశివరాత్రి రోజున మహన్యాసపూర్వకరుద్రాభిశేకం, శాంతికల్యాణం, రుద్రహోమం జరుగుతాయి.
ప్రధానంగా మల్లన్న యాదవుల, కురుమల ఇష్టదైవం. ఇది ప్రముఖమైన జానపదుల జాతర. సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో జరుగుతుంది. 'బోనం' అనే ప్రత్యేక వంటకాన్ని కొత్త కుండలో వండి స్వామివారికి నివేదిస్తారు. అనంతరం 'ఒగ్గు పూజారులు 'గా వ్యవహరింపబడే కురుమ పూజారులు, ఢమరుకాన్ని వాయిస్తూ, నేలపై రంగురంగుల ముగ్గులనువేసి, జానపద బాణీలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు. దీన్ని పట్నం వేయడం అంటారు. ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారికళ్యాణం. ప్రతీ మాస శివరాత్రిరోజున నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను ఒగ్గు పూజారీలు నిర్వహిస్తారు.

పాకాల సరస్సు,కోమరవల్లి

పాకాల సరస్సు
మానవ నిర్మితమైన 30చదరపు కి.మీ.ల ఈ సరస్సు క్రీ శ.1213 లో కాకతీయ రాజు గణపతి దేవునిచే కట్టించబడింది. నర్సంపేట పట్టణానికి 12కి మీ దూరం లో నున్న ఈ సరస్సు , చుట్టుప్రక్కల ఉన్న అభయారణ్యం , ప్రకృతిని ఆరాధించే వారికి ఇది ఒక స్వర్గము. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పాకాల చెరువుగా పిలిచే ఈ చెరువు మధ్యలో ఉన్న కొండ అద్బుతమైనది. "పాకాల రామక్క గుండం" గా పిలవబడే ప్రదేశం లో ప్రజలు మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. కోతులు,కొండముచ్చులు పుష్కలంగా ఉన్నాయి. చుట్టూ ప్రక్కల ఉన్న అడవి లో చిరుత పులులు, జింకలు, దుప్పులు, అడవి పందులు విరివిగా ఉన్నాయి


కోమరవల్లి

కోమరవల్లి , వరంగల్ జిల్లా, చేర్యాల మండలానికి చెందిన గ్రామము
సిద్ధిపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 20 కి.మీ, మ0డల0 చేర్యాలకి 10 కి.మీ. దూరంలో ఉన్న కోమరవల్లి మల్లన్న స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది . ఇక్కడ జాతర జనవరి నెలలో ప్రారంభమై ఉగాది వరకు జరుగుతుంది.

కొమురవెల్లి మల్లన్న స్వామీని బన్ద సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండం మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం. ఈ దేవుని ఎక్కువగ కురుమలు, గొల్లలు, కాపువారు పూజిస్తారు. గుడి ఎదురుగా గంగ రేగి వృక్షము కలదు. ఇక్కడ పత్నాలు వేసి బోనాలను, మొక్కుబడి కలవారు "కొర మీసాలను "సమర్పిస్తారు. ఈ జాతరలో శివ భక్తులు ప్రత్యేక అకర్షణ.


వరంగల్ కోట

వరంగల్ కోట

వరంగల్ దుర్గం గా ప్రసిద్ధిచెందిన ఓరుగల్లు కోట చరిత్ర 13వ శతాబ్ధము నుండి ఉన్నది. ఓరుగల్లు కోట వరంగల్ రైలుస్టేషనుకు 2 కి.మీ. దూరంలోనూ,హనుమకొండ నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. కోట కీర్తి తోరణాలు ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక చిహ్నంగా వాడుకలో ఉన్నాయి.
ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి 1261 వ సంవత్సరంలో పూర్తి చేసారు. ఒరుగల్లును కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు (1323-1331),ముసునూరి నాయకులు (1331-1368), రేచెర్ల నాయకులు (1368-1424), బహమనీ సుల్తానులు (1424-1504), భోగికుల సితాబ్ ఖాన్ (1504-1529),గొల్లకొండ కుతుబ్ షాహీలు (1579-1687) పాలించారు[
చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. మెదటి ప్రాకారాన్ని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారములో ఉన్న రాతికోట గ్రానైటు రాళ్ళతో నిర్మితమైనది. రాతి కోటకు పెద్దపెద్ద ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిలానిర్మితమైనవి. ప్రతిప్రాకారానికి వెలుపల పెడల్పాటి, లోతైన కందకాలున్నాయి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి. ఇలాంటి నాలుగు ద్వారాలతో ఈ కోట 19 చదరపు కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది.
స్వయంభూశివాలయం
కాకతీయ చక్రవర్తులకు స్వయంభూశివాలయం చాల ప్రాముఖ్యతతో కూడినది. ప్రతాపరుద్ర చరిత్రము లో ఏకామ్రనాథుడు ఓరుగల్లులో జ్యోతిర్మయంబగు స్వర్ణలింగం ఉద్భవించినట్లు వ్రాశాడు. మరియు అద్దేవుండు మధ్యప్రదేశంబుననుండునట్లుగా గొలిచి యోజన విస్తారంబుగా పురంబు గట్టదలచి .....ఓరుగల్లు పట్టణంబు గట్టిరి. స్వయంభూశివాలయం కోట మధ్యలో నిర్మించబడి ఉన్నది. ఖండములై పడివున్న చతుర్ముఖలింగము ఆలయములో మూలవిరాట్. ఆలయ ప్రాకారమునకు వెలుపల నాలుగు దిశలా నాలుగు కీర్తి తోరణములున్నాయి. ఆలయను పూర్తిగా ధ్వంసము చేసిన తురుష్కులు తోరణములను మాత్రము విడిచిపెట్టారు.
క్రీ. శ. 1296లో దేవగిరి స్వాధీనము తరువాత తుగ్లక్ సుల్తానుల కన్ను ఆంధ్రదేశముపై బడింది. సంపదతో తులతూగుతున్న ఓరుగల్లు వారి అసూయాద్వేషాలకు కారణమయింది.
మొదటి ముట్టడి
క్రీ. శ. 1310లో మాలిక్ కాఫుర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టిగోడను ధ్వంసం చేశాడు. లోపలి రాతిగోడను ఛేదించలేక కోట బయటి గ్రామాలను నాశనము చేసి అమాయక ప్రజలను వధించుట మొదలుపెట్టగా ప్రతాపరుద్రుడు సంధిచేసుకొని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, 100 ఏనుగులు, కోహినూరు వజ్రము అప్పగించాడు[2].
రెండవ ముట్టడి
1321లో ఘియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుఘ్ ఖాన్ (మహమ్మద్ బీన్ తుగ్లక్)ను ఓరుగంటిపై దాడికి పంపుతాడు. వీరోచితముగా పోరాడిన ప్రతాపరుద్రుని సైన్యము ధాటికి తట్టుకోలేక, మరియు ఆ సమయములో వ్యాపించిన మహమ్మారి వల్లనూ, ఆరు నెలల ముట్టడి తర్వాత ఉలుఘ్ ఖాన్ వెనుతిరుగుతాడు.
మూడవ ముట్టడి
ఉలుఘ్ ఖాన్ రెట్టించిన ఉత్సాహముతో, బలీయమైన సైన్యముతో 1323లో మరలా దాడికి వచ్చాడు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యముగా సుల్తాను సేనలనెదుర్కొంటాడు. తుర్క్ సేనలుపయోగించిన ఆధునిక పద్ధతులవల్ల, బలీయమైన అశ్వికదళము వల్ల, తెలుగు నాయకుల అనైక్యత వల్లనూ, పరాజయము తప్పలేదు. ప్రతాపరుద్రుడు, కటక పాలుడు గన్నమ నాయుడు బందీలవుతారు. వారిని ఢిల్లీ తరలిస్తుండగా మహారాజు నర్మదా నదిలో మునిగి ఆత్మార్పణం చేసుకుంటాడు. ఢిల్లీలో గన్నమ నాయుడు (మాలిక్ మక్బూల్) ఇస్లాము మతములోనికి మార్చబడ్డాడు. ఉలుఘ్ ఖాను ఓరుగల్లును దౌలతాబాదు అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచి ఢిల్లీకి మరలుతాడు.
సుల్తానుల పాలన
ఓరుగంటి పేరు సుల్తాన్ పూర్ అని మార్చబడింది. స్వయంభూశివాలయము పూర్తిగా ధ్వంసం చేయబడింది. ప్రాకారము, గర్భగుడి, అస్థాన మండపము నేలమట్టము చేయబడ్డాయి. కోట కేంద్రస్థానములో మూడు కట్టడాలు నిర్మించబడ్డాయి. ఇవి ఖుష్ మహల్, జామీ మసీదు, . ఈ కట్టడాలకు గుడి రాళ్ళు, స్థంభాలు విరివిగా వాడబడ్డాయి. తోరణాలు మాత్రము వదిలివేయబడ్డాయి.
ఖుష్ మహల్
ఇది 38x17.5 మీటర్ల కొలతలతో ఆరు మీటర్ల మందముగల గోడలతో కట్టబడిన పొడవాటి కొలువు కూటమి హాలు. తుగ్లకాబాద్ కోటలోనున్న ఘియాసుద్దీన్ తుగ్లక్ మహలులోని 'దివాన్-ఏ-ఆమ్'ను అనుసరించి ఖుష్ మహల్ కట్టబడింది. ఇది మధ్య ఆసియా దేశములలో 'ఐవాన్' పారశీక పద్ధతిలో కట్టబడిన భవంతి. కమానులు గుర్రపు నాడా ఆకారములో ఉంటాయి. 14వ శతాబ్దపు సుల్తానుల కాలములో కట్టబడి ఇప్పటికీ మంచి స్థితిలోనున్న కొలువు కూటమి ఖుష్ మహలు.
జామి మసీదు
ఖుష్ మహలు వలె కాకుండా పూర్తిగా శిధిలావస్థలోనున్న కట్టడము జామి మసీదు. ప్రస్తుతము మిగిలిఉన్నది ఐదు స్థంభములు, వాటిపైనున్న దూలాలు, కొంత లోకప్పు మాత్రమే. ఈ స్థంభాలు స్వయంభూ శివాలయములోని మండపము భాగాలు. మసీదు 1323-1331 సంవత్సరముల మధ్య ఓరుగల్లు తుఘ్లక్ ఆధీనతలోనున్న సమయములో కట్టబడింది. ఇది విజయసూచిక మసీదు. అనగా శత్రువులను జయించిన తరువాత వారి మతసంబంధిత కట్టడములపై నిర్మించు మసీదు. ఇందు చతురస్రములో పొదిగిన అష్టకోణము అకారములోనుండు గవాక్షములుంటాయి. జామి మసీదులోని పదిహేను మీటర్ల పొడవుగల గుమ్మటపు గవాక్షము సుల్తానుల కాలపు మసీదులన్నింటిలో పెద్దది.

రామప్ప



                     రామప్ప దేవాలయము


ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానియైనహైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు కలదు. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటలకు అధారంగా ఉన్నది. పాలంపేట చారిత్రత్మాక గ్రామము కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. [1] కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.
ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారము రాముడు మరియుశివుడు కలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉన్నది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము కలదు. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్థంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాధలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నవి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది.[2] దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.[3] ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నది. ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్ధములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిధిలము అయ్యింది. ఆలయ ముఖ ద్వారము శిధిలమైపోయింది.[4] నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం అను నృత్య రీతిని ఈ శిల్పాల నుండి గ్రహించి కంపోజ్ చేశారు.
ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణం లో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి.కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. [5]అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం[6] మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు.

భద్రకాళీ దేవాలయము

భద్రకాళీ దేవాలయము

శ్రీ భద్రకాళీ దేవస్థానము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, వరంగల్ నగరమునందు ఉన్నది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరమున గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది. శ్రీ భద్రకాళీదేవీ విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండువుగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. అమ్మవారు ప్రేతాసనాసీనయై ఉన్నది. ఆమె 8 చేతులతో - కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, ఛురిక, జపమాల, డమరుకము : ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలము, ఛిన్నమస్తకము, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్నది.

ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోర్కెలను తీరుస్తూ ఉండినట్లూ 'ప్రతాపరుద్ర చరిత్రము' మరియి 'సిద్ధేశ్వర చరిత్రము' గ్రంథాలలో కనిపిస్తుంది. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగుమీద ఎక్కి ఏకశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువుకూటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరచి పంపివేశారు. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ విద్వాంసులను కారుమాటలతోనైన జయించాలనే ఉద్దేశ్యంతో "ఈ వేళ కృష్ణచతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా?" అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే, ఔనంటే సుదర్శనమిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది. కాదంటేనే అతనిని ఓడించినట్లవుతుంది అని నిర్ణయించి, "రేపు పౌర్ణమి" అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండింది. ఆ సంకట స్థితినుంచి తమను రక్షించుకోటానికి ఆ విద్వాంసులలో ప్రధానుదైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై "నీ మాట నే నిలుపుతా" నని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి, సుదర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీశక్తి కాని, మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగ శ్రీ భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటినుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివాడు. కనుక ప్రతాపరుద్రుని కాలంనాటికే భద్రకాళీ దేవాలయం ప్రసిద్దమై ఉండినట్లు సృష్టమవుతుంది.
క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. అదీకాక హైదరాబాదు సంస్థానంలో సాగినగోల్కొండ నవాబుల పాలన, రజాకార్ల దుశ్చర్యల ఫలితంగా దాదాపు క్రీ.శ. 1950 వరకూ ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. 1950లో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్ శాస్త్రి మరియు స్థానిక శ్రీవైష్ణవ పండితులు శ్రీమాన్ ముడుంబై రామానుజా చార్య నగరంలో ఉండిన ఒక ప్రముఖ వ్యాపారి మగన్లాల్ సమేజా గారి వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసిందిగా కోరడానికి మరునాడు ఉదయం వెళ్దామని నిశ్చయించుకున్నారు. అదే రాత్రి శ్రీమగన్లాల్ సమేజా గారికి అమ్మవారు కలలో కనపడి రేపు నీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించినదట. మరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునురుద్దరణకు నావంతు సహకారము అందిస్తానని శాస్త్రి గారికి మాట ఇవ్వగా శ్రీ గణేశ శాస్త్రి గారు ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం వరకు క్రమం తప్పకుండా శ్రీమగన్లాల్ సమేజా గారి కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చింది. అమ్మవారికి మహిమకు ముగ్ధుడైన శ్రీమగన్లాల్ సమేజా ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. ఆ సందర్భంలో ఆయనకు శ్రీ విద్యానిధియైన బ్రహ్మశ్రీ హరి రాధాకృష్ణమూర్తి గారు, తాండ్ర వెంకటరామనర్సయ్య గారు, అడ్లూరి సీతారామశాస్త్రి గారు, వంగల గురువయ్య గారు, టంకసాల నరసింహారావు గారు, మహాతపస్విని మంగళాంబిక గారు ఇత్యాది మహనీయులు ఎందరో చేసిన సహకారం చిరస్మరణీయము.
శ్రీ భద్రకాళీ దేవాలయము క్రీ.శ.625 లోనే నిర్మించిపబడిందని స్థానికుల కథనం. వేంగీ చాళుక్యులపైన విజయం సాధించటానికి, పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించినట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండశిలమీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కటం చాళుక్య సంప్రదాయంలో కనిపిస్తుంది. రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్తంభాలు చతురస్త్రాకారంలో ఉన్నాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది. ఆ కారణాల వల్ల ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిందని కొందరి ఊహ. అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానము, ఆ స్తంభాలను నిలబెట్టిన విధానము, విశాలమైన ముఖద్వారము అన్నీ కాకతీయుల కాలంలో నిర్మింపబడిందేనని అనిపస్తుంది. అంతేకాక దేవాలయములోని అంతరాళ స్తంభాలలో ఒకదాని మీద: "మహేశశ్చారు సంధత్తే మార్గణం కొనకాచలే! మంత్రి విఠన ఎఱ్ఱస్తు మార్గణే కనకాచలమ్!!"
అనే శ్లోకం కన్పిస్తుంది. ఈ శాసనపాఠం పురాతత్త్వ శాఖవారు ప్రచురించిన వరంగల్ జిల్లా శాసనాల్లో (పు.307) ఉన్నది. ఈ శ్లోకంలోని ఎఱ్ఱన క్రీ.శ.10వ శతాబ్దిలో కాకతిపురమును పాలించినట్లు గూడూరు శాసనముని బట్టి తెలుస్తున్నది. ఈయన తండ్రి విఠనామాత్యుడని, ఆయనకు మీసరగండడనే బిరుదు ఉండేదని ఈ శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. ఇదే విషయము దేవాలయములోని మరొక స్తంభం మీద కూడా కొంచెం భేదంతో ఉన్నది. అది
"మంత్రిమీసరగండేన, విఠనామాత్య సూనునా! ఎరయాఖ్యేన సమోదాతా, న భూతో న్ భవిష్యతి!!"
అనే శ్లోకం. ఈ రెండు స్తంభశాసనాలను బట్టి ఈ దేవాలయం క్రీ.శ.10వ శతాబ్దంలో నిర్మింపబడి ఉంటుందని ఊహింపవచ్చును. లేదా కాకతి ప్రతాపరుద్రుని సర్వసైన్యాధిపతియైన ఆడిదం మల్లుకు కూడా మీసరగండడనే బిరుదు కన్పిస్తుంది. కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మింబడిందో సరిగ్గా చెప్పలేము. ఏమైనప్పటికీ కనీసం వెయ్యు సంవత్సరాల చరిత్ర గలది ఈ శ్రీ భద్రకాళీ దేవాలయం.
1950లో పునరుద్ధరించే సమయం చరకూ అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. ప్రాచీనకాలంలో కూడా అట్లాగే భయంకరంగా ఉండేదనటానికి - "తనరు భద్రేశ్వరి యనంగ భయదంబుగాగ" - అన్న సిద్ద్శ్వరచరిత్ర (పు.24) లోని మాటలే నిదర్శనము! అలాంటి రౌద్రస్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. (దక్షిణాచార సంప్రదాయం ప్రకారము అర్చింపబడే మూర్తి శాంత స్వరూపంగా ఉండాలనేది శాస్త్ర విధి). అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీచండీయంత్ర ప్రతిష్ఠ చేసి, ప్రతి సంవత్సరమూ శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతి నిత్యము దూపదీప నైవేద్యాదులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు.
గర్భాలయానికి రెండువైపులా రెండు చిన్న గదులు ఉన్నాయి. ఆవి బహుశా యెగులో సిద్ధులో తపస్సు చేసుకోటానికి ఉపయోగించేవేమో అనిపిస్తుంది. అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉన్నది. అందులో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని ప్రతీతి. అమ్మవారి గుడికి వెళ్ళేదారిలో, చెఱవు ప్రక్కన ఉండిన ఒక పెద్ద కొండమీద గణపతి విగ్రహం ఒకటి ఉండేది కొండతో పాటు అది కూడా అంతరించి పోయింది. 1966లో వరంగల్-ఖాజీపేట ప్రధాన రహదారిగుండా శ్రీ భద్రకాళీ దేవాలయానికి బి.టి. రోడ్డు, వీది దీపములు ఏర్పాటు చేయించబడినవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ స్థపతి పద్మశ్రీ గణపతి స్థపతి గారి నేతృత్వంలో దక్షిణభారత దేవాలయ సంప్రదాయానికి అనుగుణంగా ఆలయ శిఖరం, మహా మండపం, శాలాహారదులు నిర్మింపబడినవి.
ఆమ్మవారికి ఎదురుగా పెద్ద చెఱవు ఒకటి ఉన్నది. దానినే భద్రకాళీ చెఱవు అంటారు. వరంగల్ నగర ప్రజలకు తాగునీటి సరఫరా ఈ చెఱవు నుండే జరుగుతుంది
మహామండపంలో దక్షిణంవైపున ఒక శిలమీద చెక్కిన పార్వతీపరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు భద్రకాళీ అమ్మవారు ఉన్న భూమియలముతో సమానంగా ఉండటం వలన ఇవి కూడా ప్రాచీనకాలపువే అనిపిస్తుంది. అదీకాక, ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో కాక పార్వతీపరమేశ్వరుల రూపంలో ఉండటం విశేషము. శివపార్వతులిద్దరినీ ఒకే రాతిలో చెక్కిన ఉమామహాశ్వర విగ్రహాలు కూడా కాకతీయ శిల్పాలలో కనిపిస్తాయి. ఆలయ ముందుభాగంలో మహామండపం ఒకటి నిర్మించారు. అందులో ధ్వజస్తంభము, సింహవాహనము, బలిపీఠము, సుబ్రహ్మణేశ్వరుడు, ఆంజనేయస్వామి ప్రతిష్ఠలు ఉన్నాయి. ఇటీవలనే శ్రీవల్లభ గణపతి దేవాలయం మరియి పవిత్ర పరిక్రమ కూడా నిర్మింపబడినవి.
ప్రతి నిత్యము జరిగే ధూపదీప నైవేద్యాదులు కాక ప్రతి సంవత్సరమూ ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.
ఆషాఢమాసంలో పౌర్ణమినాడు అమ్మవారిని "శాకంభరి"గా అలంకరిస్తారు. ఆనాడు రకరకాల కూరగాయల దండలతో శోభిల్లే అమ్మవారి రూపం మాటల్లో వర్ణించలేనిది.
ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాత్రి అమ్మవారు శ్రీకృష్ణుడి రూపంలో అలంకరించబడి పూజింపబడుతుంది (గోప్త్రీ గోవింద రూపిణీ - "లలితా సహస్రనామము").
వైశాఖ శుద్ధ పంచమి "శంకర జయంతి" రోజున శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కళ్యాణోత్సవాలు (బ్రహ్మోత్సవాలు) దేదీప్యమానంగా జరుగుతాయి.
1940లో జరిగిన సంప్రోక్షణకు పూర్వం ఇక్కడ జంతుబలులు ఇచ్చేవారని ప్రతీతి. కాని ప్రస్తుతం దక్షిణాచార సంప్రదాయం ప్రకారం - ఉషకాలార్చన, అభిషేకము, ఆవరణార్చన, చతుషష్ఠి ఉపచార పూజ, సహస్రనామము,అష్టోత్తర శతనామ పూజలు మొదలైనవి వేదోక్తంగా జరుగుతున్నాయి.

వేయి స్తంభాల గుడి

వేయి స్తంభాల గుడి

11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున కలదు. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలొ నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యణ మంటపానికి మరియు ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది.

ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడినికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వార పాలకులుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరున్ని అర్చించి భక్తులు రుద్రేశ్వరున్ని దర్శిస్తారు.

ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం మరియు ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పుణాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది.

ఆలయ ప్రాంగణంలో మరేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్య కలాపాలకొరకై ఓరుగల్లు కోట మరియు ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా మరియు రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగినది. ఇటీవల పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో కల్యాణ మంటపం క్రింద ఒక బావి వెలువడింది[ఆధారం కోరబడినది].

మాఘ, శ్రావణ మరియు కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వెస్తే రాలనంతగా భక్త జన సందోహం రుద్రేశ్వరున్ని దర్షిస్తారు. మహన్యాస పుర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్యపూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగిలిస్తుందనడం నిస్సంశయం.

ఇంతటి ప్రశస్థి కల ఈ ఆలయానికి దూరప్రాంతాల వారు ఖాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్న పిదప బస్సు లేక ఆటోల గుండా 5 కి.మీ. దూరంలో నున్న హనుమకొండ నగరానికి చేరుకొని ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించవచ్చు.